ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరం ఏంటి? అనగానే మౌంట్ ఎవరెస్ట్ అని టక్కున చెప్పేస్తాం. అవును తాజాగా దీని ఎత్తు మారింది. గతంలో కంటే 86 సెంటిమీటర్లు పెరిగింది. నేపాల్, చైనా సంయుక్తంగా దీని ఎత్తును కొలిచి 8848.86 మీటర్లుగా నిర్ధారించాయి. 1954లో భారత్ కొలిచిన కొలత(8848 మీటర్లు) కంటే 86 సెంటిమీటర్లు అధికంగా ఉన్నట్లు మంగళవారం నాడు ప్రకటించాయి. 2015లో నేపాల్లో భూకంపం వచ్చినప్పటి నుంచి ఎవరెస్టు శిఖరం కచ్చితమైన ఎత్తును కొలవాలనే వాదనల వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన శిఖరమైన మౌంట్ ఎవరెస్టు నూతన ఎత్తు వచ్చేసి 8848.86 మీటర్లుగా చైనా, నేపాల్ ప్రకటించాయి. ఇందుకు సంబంధించి చైనాకు చెందిన జిన్హువా వార్తా సంస్థ తన నివేదికలో తెలిపింది. ఎవరెస్టు పర్వతం ఎత్తును 8848.86 మీటర్లు ఎత్తులో నేపాల్ తిరిగి లెక్కిస్తున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి ప్రదీప్ గ్యవాలి ఖాట్మాండులో ప్రకటించారు.
1954లో సర్వే ఆఫ్ ఇండియా కొలత ప్రకారం ఎవరెస్టు పర్వతం ఎత్తు 8848 మీటర్లు. గతంలో చైనా కొలత ప్రకారం ఎవరెస్టు పర్వతం ఎత్తు 8844.43 మీటర్లు. ఇది నేపాల్ లెక్కల కంటే నాలుగు మీటర్ల తక్కువ. అంతకుముందు చైనా సర్వేయర్లు ఎవరెస్టు శిఖరంపై ఆరు రౌండ్ల కొలత, శాస్త్రీయ పరిశోధనలు నిర్వహించి 1975, 2005లో రెండు సార్లు ఎవరెస్టు ఎత్తును విడుదల చేశారు. ఇది వరుసగా 8848.13 మీటర్లు, 8844.43 మీటర్లుగా ఉంది. టిబెటన్ భాషలో ఎవరెస్టు పర్వతాన్ని కోమోలాంగ్మా పర్వతం అని అంటారు.
చైనా, నేపాల్ తమ సరిహద్దు వివాదాన్ని 1961లో ఎవరెస్టు శిఖరం గుండా సరిహద్దు రేఖతో పరిష్కరించాయి. ఎవరెస్టు ఇండియన్ ప్లేట్, యురేపియన్ ప్లేట్ అంచుల మధ్య ఘర్షణ కుదింపు జోన్లో ఉంది. ఇక్కడ క్రస్టల్ కదలిక చాలా చురుకుగా ఉంటుంది. కోమోలాంగ్మా పర్వతం ఎత్తును కచ్చితంగా కొలవడం హిమలయాలు, క్వింగై-టిబేట్ పీఠభూమి ఎత్తు మార్పులను అధ్యయనం చేయడానికి సహాయపడుతుందని చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ తో వాతావరణ భౌతిక శాస్త్రవేత్త గవో డెంగీ తెలిపారు.
0 Comments