ఇండియాలో కరోనా వైరస్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగం కోసం ఇప్పటికే మూడు సంస్థలు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలుసు కదా. వీటిని పరిశీలించడానికి బుధవారం డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నియమించిన నిపుణుల కమిటీ సమావేశం కాబోతోంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి వాళ్లు ఏ అంశాలను పరిగణనలోకి తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ రేసులో భారత్ బయోటెక్, ఫైజర్, సీరమ్ ఇన్‌స్టిట్యూల్ ఆఫ్ ఇండియా ఉన్నాయి. ఈ ప్రక్రియలో భాగంగా మొదటగా వ్యాక్సిన్ భద్రతకు సంబంధించిన అంశాలను నిపుణుల కమిటీ పరిశీలించనుంది. వ్యాక్సిన్ నాణ్యత, సామర్థ్యానికి సంబంధించిన అన్ని అంశాలపై తొలి రెండు గంటల పాటు కమిటీ పరిశీలిస్తుందని ఓ అధికారి వెల్లడించారు.
క్లినికల్ ప్రయోగాల్లో తమ వ్యాక్సిన్ సమర్థవంతంగా పని చేసిందని సదరు కంపెనీలు నిరూపించుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి పలు ప్రశ్నలను కమిటీ సభ్యులు కంపెనీ ప్రతినిధులను అడుగుతారు. ఒకవేళ వాళ్ల సమాధానాలు సంతృప్తికరంగా ఉంటే.. ఫైల్‌ను డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు పంపిస్తారు. అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చే అధికారం కేవలం డీసీజీఐకే ఉంటుంది. ఒకవేళ స్పష్టత కరువైతే.. మరింత సమాచారం ఇవ్వాల్సిందిగా సదరు కంపెనీని నిపుణుల కమిటీ అడిగే అవకాశం ఉంటుంది. షరతులతో కూడిన అత్యవసర వినియోగానికి అనుమతి, కంపెనీ కేవలం ప్రభుత్వానికి మాత్రమే వ్యాక్సిన్ సరఫరా చేయాలన్న నిబంధనలు కూడా విధించే అవకాశం కూడా ఉంటుంది.
0 Comments